రైతుల సమక్షంలోనే భూముల కొలతలు..నిబంధనల ప్రకారమే ప్రతి అంగుళం భూమికి పక్కా లెక్క: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

రైతుల సమక్షంలోనే భూముల కొలతలు..నిబంధనల ప్రకారమే ప్రతి అంగుళం భూమికి పక్కా లెక్క: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 
  • అభ్యంతరాలను తేల్చాకే  తుది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశం

 హైదరాబాద్, వెలుగు: భూ రీసర్వేను పకడ్బందీగా, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం, క్షేత్రస్థాయి స్వాధీనం, రికార్డుల మధ్య తేడాలను పారదర్శకంగా గుర్తించి పక్కా రికార్డులు రూపొందించడమే భూ రీసర్వే లక్ష్యమని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రైతుల సమక్షంలోనే కొలతలు తీసి, ప్రతి దశలో వారికి సమాచారం ఇవ్వాలని వివరించారు.

భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) మార్గదర్శకాలను తూచ తప్పకుండా అమలు చేయాలని తెలిపారు. సర్వే–సరిహద్దుల చట్టం–1923, తెలంగాణ భూ భారతి చట్టం–2025 ప్రకారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సమన్వయంతో పనిచేయాలన్నారు. సర్వేకు ముందే దండోరా, గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

నాలుగు రోజుల ముందే పట్టాదారులకు నోటీసులు ఇచ్చి, రెండు రోజుల ముందుగా పొలాల సరిహద్దుల్లో జెండాలు పాతుకునేలా చూడాలన్నారు. ఫారమ్–9, 10 నోటీసులతో ప్రభుత్వ, అటవీ భూములు, చెరువుల సరిహద్దులు ఖరారు చేసి ఆక్రమణలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి భూమిని నిబంధనల మేరకు కొలిచి, విస్తీర్ణాన్ని అక్కడికక్కడే రైతుకు తెలియజేయాలని, తేడాలుంటే కారణాలను రిజిస్టర్‌‌‌‌లో నమోదు చేసి వెంటనే భూ భారతి పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలని ఆదేశించారు.

తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి

రికార్డులు, క్షేత్రస్థాయి స్వాధీనం మధ్య తేడాలు ఉన్న చోట తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. అవసరమైన గ్రామాల్లో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, గ్రామ పెద్దలు, పొరుగు రైతులు, పట్టాదారుల సమక్షంలో వివాదాలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. ఉమ్మడి ఖాతాలు, ఉమ్మడి ఎల్‌‌‌‌పీఎం ఉన్న రైతులు పరస్పర అంగీకారంతో సబ్ డివిజన్ చేసుకునేలా ప్రోత్సహించాలని, సరిహద్దు గొడవలు పెద్దవి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెక్షన్ 9(2) నోటీసుల తర్వాత అప్పీల్ వ్యవధిలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు గ్రామాల్లో పర్యటించి, రైతుల వాదనలు విని క్షేత్రస్థాయి పరిశీలనతో అభ్యంతరాలను పరిష్కరించాలని వెల్లడించారు. అన్ని అభ్యంతరాలు తేల్చాకే ఆర్డీవో ఆమోదంతో సెక్షన్ 13 కింద తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఆ తర్వాత భూ భారతి చట్టం ప్రకారం తహసీల్దార్లు రికార్డ్ ఆఫ్ రైట్స్, పోర్టల్‌‌‌‌లో సవరణలు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా చట్టబద్ధతతో తుది రికార్డులు రూపొందించాలని, రైతుల భూ హక్కులకు భద్రత కల్పించడమే రీసర్వే లక్ష్యమని వెల్లడించారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.